ఆదివారం, ఆగస్టు 01, 2021
ఆపదనిసలకుఆమె పరిష్కారం!

ఇప్పుడే పెళ్లైంది కదా! అప్పుడే పిల్లలెందుకని అనుకునే ఆలుమగలు చాలామందే. అలాంటివారు గర్భనిరోధక సాధానాలు వినియోగించడమూ సహజమే! అయితే అవి సురక్షితమేనా? ‘పూర్తిగా అవునని అని చెప్పలేం. కొంతమంది మహిళలకు వాటిలోని రసాయనాలు సరిపడకపోవచ్చు కూడా’ అనే కోమల్‌ అందుకు చక్కని పరిష్కారం కూడా అందించారు. హైదరాబాద్‌కి చెందిన కోమల్‌ బ్లూ కేర్‌ కండోమ్‌..పేరుతో హానిచేయని గర్భనిరోధకాలని అందిస్తున్నారు...

పెళ్లైన తరువాత కోమల్‌ హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. చాలామంది నవదంపతుల్లానే ఆ జంట గర్భనిరోధక సాధనంగా కండోమ్‌లని ఉపయోగించేవారు. కొన్ని రోజులు బాగానే ఉన్నా.. తర్వాత వాటితో అసౌకర్యం మొదలయ్యింది. జననావయవాల్లో మంట, ఇన్‌ఫెక్షన్‌ వంటి సమస్యలు ఆమెని ఇబ్బందిపెట్టేవి. ఇందుకు కారణం... హానికర రసాయనాలతో తయారు చేసిన కండోమ్‌లే అని తెలుసుకుందామె. పారాబెన్స్‌, కృత్రిమ పరిమళాల కారణంగానే ఈ పరిస్థితి అని ఆమె పరిశీలనలో తెలుసుకుంది. పైగా ఇవి.. హార్మోన్లు, జననావయవాల్లోని పీహెచ్‌ అసమతుల్యతకు కారణమవుతాయని తెలుసుకున్న కోమల్‌ ప్రత్యామ్నాయాల కోసం వెతుకులాట మొదలుపెట్టింది.

వైద్యుల సలహాతో...

కోమల్‌ తనకెదురైన అనుభవాలను వైద్యులకు వివరించింది. దాంతో వాళ్లు గర్భనిరోధక మాత్రలు వినియోగించాలని సలహా ఇచ్చారు. బాగానే ఉంది కానీ.. వీటిని ఎప్పుడోఒకసారి వాడితే ఫరవాలేదు... తరచూ వినియోగిస్తే కూడా ఆరోగ్యానికే ప్రమాదమని తెలుసుకుంది. మళ్లీ ఆలోచనలో పడింది కోమల్‌. అప్పుడే ఎటువంటి హాని కలిగించని కండోమ్‌ల కోసం ఆరా తీసింది. ఒకసారి కోమల్‌ యూరప్‌ను చుట్టిరావడానికి వెళ్లింది. అప్పుడే ఆమెకు నాన్‌ టాక్సిక్‌ కండోమ్‌ల గురించి తెలుసుకుంది. విదేశాలకు చెందిన నిపుణుల సాయంతో... ప్రయోగశాలలో రెండేళ్ల పాటు శ్రమించి వీటిని తయారుచేయించింది.

అలా అనుకున్నారు...

కండోమ్‌... దీని గురించి మాట్లాడటానికే చాలామంది మహిళలు వెనుకంజ వేస్తారు. అలాంటిది కోమల్‌ నాలుగు వందల మంది మహిళలపై సర్వే చేసింది. చాలామందికి తనలాంటి అనుభవమే. కానీ ఎవరికీ చెప్పుకోలేక కుమిలిపోతున్నవారెందరో. మరోపక్క ఈ సర్వే చేసే సమయంలో కోమల్‌కి ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఎదురయ్యాయి. ‘సమాజాన్ని నాశనం చేస్తోంది. మాట్లాడకూడనివన్నీ అడిగిమరి తెలుసుకోవాలనుకుంటోంది...’ అంటూ ఏవగించుకునేవారు. అయినా వెనక్కి తగ్గకుండా.. అనుకున్న పని పూర్తి చేసింది. ఇలా ఎన్నో ప్రయత్నాల తరువాత ఆమె కిందటేడాది ‘బ్లూ కాండోమ్స్‌’ పేరుతో ఒక సంస్థను మెదక్‌లో ఏర్పాటు చేసింది. వీటిని ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో ఉంచింది.