శుక్రవారం, డిసెంబర్ 02, 2022
కోడిగుడ్డుకే... కొక్కొరొకో!

కోడిపిల్లల ఉత్పత్తి, పెంపకం ఓ సవాలు. ఏ కాస్త ఏమరుపాటుగా ఉన్నా... లక్షల్లోనే నష్టం. మరోవైపు ఆ ప్రభావం పౌల్ట్రీ రైతుల మీదా పడుతుంది. ప్రత్యక్షంగా అలాంటి ఓ అనుభవం చూసిన అర్చన చిందం  కోడిపిల్లల ఉత్పత్తి కేంద్రం(హ్యాచరీ)లో సాంకేతిక మార్పులకు శ్రీకారం చుట్టారు. సరికొత్త ఉపకరణాన్ని అందుబాటులోకి తెచ్చి... కోడి పిల్లల ఉత్పత్తిని పెంచుతూ పౌల్ట్రీ రైతుల ఇంట సిరుల పంట కురిపిస్తున్నారు. 
ప్రపంచంలోనే భారతదేశం కోడిగుడ్ల ఉత్పత్తిలో మూడో స్థానం, చికెన్‌ ఉత్పత్తిలో ఐదో స్థానంలో ఉంది. పైగా మనదేశంలో గుడ్లు, చికెన్‌ ఉత్పత్తిలో అరవై శాతం వాటా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మహారాష్ట్రలదే. అలాంటి పరిశ్రమకు నా వంతుగా సాంకేతిక సాయం అందించడం గర్వంగా అనిపిస్తోంది. నేను ఈ రంగంవైపు ఎలా అడుగులు వేశానంటే... 

ఇంట్లో నుంచే పర్యవేక్షణ: నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్‌లో. మావారిది ఐటీ రంగం. దాంతో నేనూ ఆయనతోపాటు అమెరికా వెళ్లిపోయా. అక్కడే ఉద్యోగం చేయడం మొదలుపెట్టా. కొన్నాళ్లకి సంపాదన కంటే... కుటుంబ సభ్యులతో కలిసుంటేనే సంతృప్తి అని అనిపించింది. అలా ఎనిమిదేళ్ల క్రితం హైదరాబాద్‌ వచ్చేశాం. ఇక్కడకి వచ్చాక సొంతంగా మేమిద్దరం కలిసి ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నాం. అప్పటికే మా మామ గారికి చర్లపల్లిలో ఓ పరిశ్రమ ఉంది. పాతతరం పద్ధతులతో నడుస్తున్న దాన్ని చూసినప్పుడు...అక్కడ సాంకేతిక మార్పులు చేస్తే బాగుంటుందనిపించింది. అక్కడ ఉన్న యంత్రాల్నీ, తయారయ్యే ఉత్పత్తుల్ని ఇంటి నుంచే పర్యవేక్షించేలా ఓ పరికరం తయారుచేశాం. దానివల్ల ఎప్పటికప్పుడు అక్కడ జరిగే ప్రతిపని సమాచారం సెల్‌ఫోన్‌కే వచ్చేస్తుంటుంది. దీని తయారీకి దాదాపు ఏడాది పాటు కష్టపడ్డాం. అనుకున్నది సాధించాం. అది తెలిసి కొందరు వ్యాపారులు తమ ఉత్పత్తులకి అనుగుణంగా అలాంటివి పరికరాల్ని తయారుచేసి ఇవ్వమని అడిగారు.

 ప్రత్యక్షానుభవంతో: ఆ సమయంలోనే మాకు ఓ కోడిపిల్లల ఉత్పత్తిదారుడు పరిచయమయ్యాడు. తమ హ్యాచరీలో కోడిగుడ్లు పొదిగే క్రమంలో కూలీలు సరిగా పర్యవేక్షించకపోవడంతో కోడిపిల్లలు రాలేదనీ, లక్షల్లో నష్టం వచ్చిందని బాధపడ్డాడు. అది విన్నాక మనదేశంలో పౌల్ట్రీలకు మంచి డిమాండ్‌ ఉంది. ఆ రంగంలో ఉన్నవారి కోసం ఏదైనా చేస్తే ఎంతో మంది రైతులకు లాభసాటి అవుతుందని అనిపించింది. అలా ఆ దిశగా దేశంలోని పలు ప్రాంతాల్లో పౌల్ట్రీలు, హ్యాచరీస్‌కి వెళ్లి అధ్యయనం చేశాం. ఆ క్రమంలో కొన్ని విషయాలు తెలిశాయి. హ్యాచరీస్‌లో కోడిగుడ్లు పొదిగిస్తారు. లక్ష గుడ్లు పొదిగిస్తే దాదాపు ఎనభై వేల పిల్లలు మాత్రమే వస్తాయి. ఆ సమయంలో వేడి, తేమ, చల్లదనం, సరిపడా గాలి... ఇలా ఆ గదిలో నిర్ణీత వాతావరణ పరిస్థితులు ఉండాలి. అప్పుడే గుడ్డు చక్కగా పొదుగుతుంది. ఆరోగ్యకరమైన కోడిపిల్లలు ఉత్పత్తి అవుతాయి. అయితే హ్యాచరీస్‌ రైతులు కేవలం కూలీల మీదే ఆధారపడుతున్నారు. పొదిగే 21 రోజుల్లో కూలీలు ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా... ఆ నిర్వాహకులకు మిగిలేది నష్టమే. పైగా ప్రతికూల పరిస్థితుల మధ్య గుడ్డు పొదిగితే దాన్నుంచీ వచ్చే కోడిపిల్ల ఆరోగ్యంగా ఉండదు. అలాంటివి కొనుక్కున్న పౌల్ట్రీ యాజమానులకీ నష్టమే. ఇవన్నీ గమనించాక పర్యవేక్షించడానికి ఓ పరికరం తప్పనిసరి అని తెలిసింది. ఆ విషయాన్ని  వెటర్నరీ వైద్యులూ సమర్థించారు. 

పునఃసమీక్ష చేస్తాం:  పౌల్ట్రీరంగంలో పనిచేసేవారిలో ఎక్కువగా నిరక్షరాస్యులే ఉండొచ్చు. అందుకే మేం వారికి యాప్‌లోని సమాచారాన్ని గుర్తులు, నంబర్లతో సులువుగా తెలుసుకునేలా రూపొందించాం. ఉదాహరణకు ఇంక్యుబేటర్‌లో పది ఫ్యాన్లు ఉంటే ఒక్కోదానికి ఒక్కో సంఖ్య ఇస్తాం. అవి తిరిగేటప్పుడు ఆకుపచ్చగా కనిపిస్తుంది. అవి ఆగిపోతే ఎరుపు రంగు వచ్చి అలారం మోగుతుంది. ఉష్ణోగ్రత, తేమ వంటివి ఎంతున్నాయో వారికి సంఖ్యారూపంలో వచ్చేలా సెట్‌ చేశాం. వీటితోపాటు రైతులకు మేం 21 రోజుల్లో ఇంక్యుబేటర్‌లో వాతావరణ పరిస్థితి ఎలా ఉంది. ఉత్పత్తి మీద ఏవి ప్రభావం చూపాయి వంటివన్నీ డేటా రూపంలో ఇస్తాం. దానికి తగ్గట్లు మార్పు చేర్పులు చేసుకోవచ్చు. ఇప్పటివరకూ మా పరికరాలను హైదరాబాద్‌, దానిచుట్టుపక్కల జిల్లాలతో పాటు.. విజయవాడ, విజయనగరం, బళ్లారి, మహారాష్ట్రలో ఏర్పాటు చేశాం. మా సంస్థకు మేడ్‌ ఇన్‌ ఇండియా సర్టిఫికెట్‌తోపాటు, పేటెంట్‌ కూడా ఉంది. మేం వీటిని రైతులకు తక్కువ ధరకే అందిస్తున్నాం.

- పద్మ వడ్డె

యాప్‌లో పర్యవేక్షణ

రెండేళ్ల క్రితం పరికరం తయారీని మొదలుపెట్టాం. ఎన్నో ప్రయోగాలు... పరీక్షల అనంతరం అది రూపుదిద్దుకుంది. దీనికి మేం ‘పౌల్ట్రీమోన్‌’ అనే పేరుపెట్టాం. పొదిగించే గది(ఇంక్యూబేటర్‌)లో ఉన్న ఫ్యాన్లు, హ్యూమిడిఫయర్లు, ఇలా... అక్కడ ఉండే ప్రతి యంత్రాన్ని డివైజ్‌తో అనుసంధానించి అమరుస్తాం. వీటి నిర్వహణ కోసం యాప్‌, వెబ్‌సైట్లూ ఉన్నాయి. హ్యాచరీ నిర్వాహకుల ఫోన్‌లో మా యాప్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకుంటే యంత్రాల పనితీరు, ఉష్ణోగ్రత, తేమ, వేడి... వంటివన్నీ ఎప్పటికప్పుడు కనిపిస్తాయి. యంత్రాలు పాడైతే వెంటనే అలారం మోగి నిర్వాహకుల్ని అప్రమత్తం చేస్తుంది. ఎంత సేపట్లో వాటి మరమ్మతులు జరిగాయో కూడా అప్‌డేట్‌ వస్తుంది. దీనివల్ల కూలీల పర్యవేక్షణ అవసరం ఉండదు. ఇలా పరిస్థితుల్ని అనుకూలంగా ఉంచుకోవడం వల్ల లక్ష గుడ్లు పొదిగిస్తే... దాదాపు ఎనభై శాతం కంటే ఎక్కువగా ఆరోగ్యకరమైన కోడిపిల్లలు ఉత్పత్తి అవుతాయి. ఆదాయం పెరుగుతుంది. పైగా ఆరోగ్యకరమైన పిల్లలు తీసుకోవడం వల్ల పౌల్ట్రీ నిర్వాహకులకీ అవి చచ్చిపోతాయని భయం ఉండదు.